వైయాకరణసిద్ధాంతకౌముది-తెలుగువ్యాఖ్య
సంజ్ఞాప్రకరణము
మునిత్రయం నమస్కృత్య తదుక్తీః పరిభావ్య చ.
వైయాకరణసిద్ధాంతకౌముదీయం విరచ్యతే.
మునిత్రయమును నమస్కరించి వారు చెప్పిన వ్యాకరణసిద్దాంతాలను చక్కగా విచారించి ఈ వైయాకరణసిద్ధాంతకౌముదిని రాస్తున్నాను అని భట్టోజీ దీక్షితులు మంగళమాచరిస్తున్నారు. ఇది సిద్ధాంతకౌముది మంగళశ్లోకము.
మంగళము అంటే - శుభము అని అర్థము. శాస్త్రాలను మొదలుపెట్టేటపుడు, మధ్యలో, చివర మంగళాచరణము చేయటం శాస్త్రసంప్రదాయము. దానివలన గ్రంథముప్రసిద్ధిచెందుతుందని, చదివేవారికి మంచిదని పెద్దలు అంటారు.
పాణినివ్యాకరణాన్నే త్రిమునివ్యాకరణము అంటారు. త్రిముని అంటే ముగ్గురు మునులు అని అర్ధం. పాణిని, కాత్యాయణుడు, పతంజలి వీరే ఆ ముగ్గురు మునులు.
పాణిని సూత్రాలను రచించాడు, కాత్యాయణుడు ఆ సూత్రాలకు వార్తికాలను రచించాడు, పతంజలి సూత్రాలను వార్తికాలను కలిపి వ్యాఖ్యానం చేసాడు దానికే వ్యాకరణమహాభాష్యమని పేరు. ఈ ముగ్గురి సిద్ధాంతలను విచారించి ఈ సిద్ధాంతకౌముదిని రాస్తున్నానని దీక్షితులు చెపుతున్నారు.
అష్టాధ్యాయిలో సూత్రాలక్రమము అనువృత్తిని, ప్రసంగాన్నిబట్టి ఉంటుంది. ఉదా - ఇత్సంజ్ఞలని విధించే సూత్రాలన్నీ ఒక చోటే ఉంటాయి, సర్వనామసంజ్ఞను విధించే సూత్రాలన్నీ ఒకచోట ఉంటాయి. కానీ ఒక ప్రయోగాన్ని సాధించాలంటే ఏమేమి సూత్రాలు అవసరమో వాటిని తెచ్చి ఒక చోట వ్యాఖ్యానం చేయటాన్ని ప్రక్రియాపద్ధతి అంటారు. సిద్ధాంతకౌముది కూడా ప్రక్రియాపద్ధతి లో రాసినగ్రంథమే, రూపమాలా, ప్రక్రియాకాముదీ కూడా ప్రక్రియాగ్రంథాలే.
సిద్ధాంతకౌముది లో ప్రకరణవిభాగముంటుంది. వాటిలో మొదటిది సంజ్ఞాప్రకరణము. సంజ్ఞ అంటే పేరు. పాణిని అష్టాధ్యాయి లో లాఘవం కోసం సంజ్ఞాసూత్రాలను రచించాడు. ఈ సంజ్ఞాప్రకరణము మాహేశ్వరసూత్రాలతో మొదలవుతుంది. మాహేశ్వరసూత్రాలంటే మహేశ్వరునినుంచి వచ్చినసూత్రాలు అని అర్ధము. అవి -
1. अइउण्, 2. ऋलृक्, 3. एओङ, 4. ऐऔच्, 5. हयवरट्, 6. लण्, 7. ऋमङणनम्, 8. झभञ्, 9. घढधष्, 10. जबगडदश्, 11. खफछठथचटतव्, 12. कपय्, 13. शषसर्, 14. हल्.
14 సూత్రాలున్నాయి కాబట్టి వీటిని చతుర్దశసూత్రాలని కూడా అంటారు.
మాహేశ్వరసూత్రాలను అణ్, అక్, అచ్, హల్ ఇలాంటి ప్రత్యాహారాల కోసం చెప్పారు. ప్రత్యాహారము గురించి ముందు తెలుసుకొంటాము. ఈ పద్నాలుగు సూత్రాలలో చివర ఉన్న హల్లులకు ఇత్ అని పేరు. హకారాదులలో అకారముచ్చారణకోసము.
ఈ మాహేశ్వరసూత్రలు ఒక క్రమములో ఉన్నాయి. మొదట స్వరవర్ణాలు, తర్వాత అంతస్ఘములైన య,వ,ర,ల లు. తర్వాత వర్గపంచమాక్షరాలు, వర్గచతుర్ధాక్షరాలు, వర్గతృతీయాక్షరాలు, వర్గద్వితీయాక్షరాలు, వర్గప్రథమాక్షరాలు, ఊష్మాక్షరాలు. వీటిలో హకారము రెండుసార్లు చెప్పడానికి ప్రయోజనము వేరే ఉంది.
No comments:
Post a Comment